
మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
కొత్తకోట రూరల్: మండలంలోని గుంపుగట్టు (కానాయపల్లి) పంపుహౌజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న మిషన్ భగీరథ ఔట్‌సోర్సింగ్ కార్మికులు 10 నెలల బకాయి వేతనాలు చెల్లించాలంటూ శుక్రవారం తాగునీటి సరఫరాల నిలిపివేసి సమ్మెకు దిగారు. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ ఎస్‌ఈ రమణ, డీఈ, ఇతర అధికారులు అక్కడకు చేరుకొని కార్మికులతో చర్చించారు. పెరిగిన వేతనాలు నెలకు రూ.12 వేల చొప్పున చెక్కు రూపంలో 29వ తేదీన చెల్లిస్తామనే షరతుతో సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం సబ్ కాంట్రాక్టర్ లింగారెడ్డి హామీ మేరకు తాత్కాలికంగా సమ్మె విరమించారు. 8 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు 10 నెలలుగా వేతనాలు, 5 ఏళ్ల బోనస్, పీఎఫ్, ఈఎస్‌ఐ బకాయిలు చెల్లించలేదని వివరించారు. సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘకాలిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.శేఖర్, కార్మికులు కురుమూర్తి, వెంకటేష్, విజయ్, సాయికుమార్, నిరంజన్, వెంకటయ్య, బాబు, గోవర్ధన్, వెంకటేష్, సంతోష్, ఈశ్వరమ్మ, నిర్మలమ్మ, వంశి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.