
చేనేత కార్మికుల ఆందోళన
● మద్దతు పలికిన బీజేపీ, బీఆర్‌ఎస్, మాస్‌లైన్, సీపీఐ నాయకులు
అమరచింత: చేనేత రుణమాఫీ వర్తింపజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడుస్తున్నా నేటికీ అమలుగాకపోవడంతో గురువారం పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా యూనియన్ బ్యాంకుకు చేరుకొని బ్యాంకు ఎదుట బైఠాయించారు. నేతన్నలకు బీజేపీ, బీఆర్‌ఎస్, మాస్‌లైన్, సీపీఐ నాయకులు మద్దుతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులతో పాటు నేతన్నలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు రూ.లక్ష రుణమాఫీ వర్తింపజేస్తూ రూ.33 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు. జిల్లాల వారీగా రుణ వివరాలను బ్యాంకుల ద్వారా సేకరించిన జౌళిశాఖ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపడంతోనే సరిపెట్టారని తెలిపారు. కార్యాలయానికి వెళ్లి ప్రస్తావిస్తే డబ్బులు వస్తే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ చెప్పడమే తప్పా రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకు మేనేజర్ తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. దీనికితోడు తమ ఖాతాలను నిలిపివేశారని చెప్పారు. మేనేజర్‌తో మాట్లాడితే తమను ధూషించారని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ.. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుంటే ఎంతటివారి ఖాతానైనా ఆర్‌బీఐ నిబంధనల మేరకు నిలిచిపోతాయి తప్ప వ్యక్తిగతంగా చేసేదేమీ ఉండదన్నారు. రుణమాఫీ డబ్బులొస్తే వారి ఖాతాల్లో జమ చేస్తామని.. అప్పటి వరకు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. జౌళిశాఖ అధికారులు చొరవచూపి తమకు న్యాయం చేయాలంటూ నేతన్నలు బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందించారు. ఆయా పార్టీల నాయకులు మంగ లావణ్య, నర్సింహులుగౌడ్, రాజన్న, రవీందర్, నేత కార్మికులు తెలుగు రమేష్, పారుపల్లి శ్రీనివాసులు, రామలింగం, శేఖర్, లడ్డు శ్రీనివాసులు పాల్గొన్నారు.