
చదువు మానిన విద్యార్థులపై దృష్టి
వనపర్తి: జిల్లాలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యలో చదువు మానిన విద్యార్థులపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అపార్ ఐడి, విద్యార్థుల డ్రాప్ అవుట్లు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలు చదువు మధ్యలో నిలిపివేస్తే బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ సంఖ్య తగ్గించడానికి ప్రతి పాఠశాల, కళాశాలపై నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఏ విద్యార్థి మధ్యలో చదువు మానేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థుల హాజరు, నాణ్యమైన బోధనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల వారీగా అర్ధాంతరంగా చదువు మానేసిన విద్యార్థుల వివరాల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల డ్రాప్ అవుట్లు తగ్గించి, ప్రవేశాలు పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అపార్ ఐడీ జనరేషన్ వేగవంతం చేయాలని కోరారు. అపార్ ఐడీ జనరేషన్ సమయంలో విద్యార్థుల ఆధార్, పదోతరగతి ధ్రువపత్రాల వివరాలు అసమతుల్యత కారణంగా త్వరగా పూర్తి చేయలేకపోతున్నామని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఆధార్ శిబిరం ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అదేవిధంగా యూడైస్‌లోనూ విద్యార్థుల వివరాలను పునరుద్ధరించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య, మండల విద్యాధికారులు, ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి