
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం వ్యతిరేకం
● పేదలకు ఇచ్చిన ప్రభుత్వ
భూములను క్రమబద్దీకరించాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
మదనాపురం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని.. జనాభా దామాషా ప్రకారం కచ్చితంగా ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని దుప్పల్లి జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు అసైన్డ్ భూములు ఇచ్చాయని.. ప్రస్తుత ప్రభుత్వం నగరాల చుట్టూ ఉన్న ఆయా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి చర్యలు సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గతంలో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములన్నింటినీ క్రమబద్దీకరించి పూర్తి స్వేచ్ఛాహక్కులు కల్పించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కేటాయింపునకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా సరే.. పేదలను ఇబ్బందులకు గురిచేస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు వెంకట్రాములు, రాజు, మేకల ఆంజనేయులు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.