
అధికారుల పొలం బాట
వానాకాలం పంట వివరాల నమోదులో ఏఈఓలు
● జిల్లాలో 2,45,356 ఎకరాల్లో సాగు
● నెలరోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ
● రైతుల మేలు కోసమే..
అమరచింత: జిల్లావ్యాప్తంగా వానాకాలం పంటల సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు అధికారులు పొలం బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల పాటు గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులు ఏయే పంటలు సాగు చేశారన్న పూర్తి వివరాలను వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని వదులుతుండటంతో ఆయకట్టు రైతులు వరి, ఆముదం, పత్తి, కంది, చెరుకు, మిరప, మొక్కజొన్న సాగులో బిజీగా ఉంటున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు పొలాల వెంట తిరుగుతూ సదరు రైతు పట్టాదారు పాసు పుస్తకం ప్రకారం ఏయే సర్వేనంబర్‌లో ఎన్ని ఎకరాల్లో ఏయే పంట సాగు చేస్తున్నారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. పంటల నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు ఆయా వ్యవసాయ సెక్టార్లలో ఆకస్మికంగా పర్యటిస్తూ పరిశీలించి వ్యవసాయ విస్తరణ అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
పంట సాగు విస్తీర్ణం
(ఎకరాల్లో..)
వరి 2,01,477
పత్తి 15,863
మొక్కజొన్న 9,475
కంది 3,744
అనుములు 2,396
వేరుశనగ 1,936
జొన్న 1,300
చెరుకు 1,135
ఉలవలు 254
పండ్లు, పూల తోటలు 8,217
255 గ్రామాలు..
72 మంది ఏఈఓలు...
జిల్లాలోని 15 మండలాలు, 72 వ్యవసాయ క్లస్టర్లలో 72 మంది ఏఈఓలు, 12 మంది ఏఓలు, ఇద్దరు ఏడీఏలతో పాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి పర్యవేక్షణలో పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాలు అధికంగా ఉండటంతో వివరాల నమోదుకు సమయం పడుతోందని వ్యవసాయ విస్తరణ అధికారులు చెబుతున్నారు. గతంలో వీఆర్వోలు గ్రామ సేవకుల సహకారంతో పంటల నమోదు ప్రక్రియ నిర్వహించే వారు. తర్వాతి కాలంలో వీఆర్వోలతో పాటు గ్రామ సేవకులను ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు బదిలీ చేయడంతో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
రైతులకు
అవగాహన కల్పిస్తూ..
సాగుచేసిన పంట వివరాలను తప్పకుండా వ్యవసాయశాఖ రూపొందించిన యాప్‌లో నమోదు చేయించుకోవాలని.. లేని పక్షంలో పంట ఉత్పత్తులను విక్రయించే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. యూరియా పంపిణీలో అలస్యం కావడంతో పంట వివరాల నమోదు ప్రక్రియలో జాప్యం జరిగిందని.. వచ్చే నెల నాటిని పూర్తిస్థాయిలో పంటల వివరాలను ఆన్‌లైన్‌లో సర్వేనంబర్ వారీగా నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.