
పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ
వనపర్తి: తెలంగాణ పల్లె సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండగని.. జిల్లాలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కలెక్టర్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలను మహిళలు తీరొక్క పూలతో అలంకరించి మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు. కార్యాలయ ప్రాంగణంలో రోజు కొన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తారని.. సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ వేడుకలను స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఈ వేడుకలో జిల్లాలోని మహిళలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కలెక్టర్ బతుకమ్మకు పూజ చేసిన అనంతరం మహిళలు బొడ్డెమ్మలు వేసి ఆడిపాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులుగౌడ్, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, అధికారులు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీఎం ఆవాజ్ యోజన సర్వే పూర్తి చేయాలి..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న కుటుంబాల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎల్ (1) కింద 39,643 కుటుంబాలు ఉన్నాయని.. ఇందులో 27,205 కుటుంబాల వివరాలు ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 33 శాతం మాత్రమే పూర్తి కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదుల, పాన్‌గల్, పెబ్బేరు మండలాలు చివరి స్థానంలో ఉన్నాయని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీఓను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే పూర్తిచేసి జియో ట్యాగింగ్ చేయడానికి నెలాఖరు చివరి తేదీగా ప్రకటించారని, ప్రతి కార్యదర్శి రోజుకు 30 ఇళ్లు సర్వే చేసి జియో ట్యాగింగ్ చేయాలని లక్ష్యం నిర్దేశించారు. మండల ప్రత్యేక అధికారులు సర్వేపై దృష్టి సారించాలని, గడువులోగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రోజువారీగా సర్వే నివేదిక అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోభా, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి