
నిర్ణీత గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
వనపర్తి రూరల్: ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సీఎంఆర్ అప్పగించాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హెచ్చరించారు. బుధవారం శ్రీరంగాపురం మండలంలోని లక్ష్మి వారాహి, లక్ష్మి నర్సింహ రైస్‌మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024–2025 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సీఎంఆర్‌ను పౌరసరఫరాలసంస్థకు అప్పగించాలని సూచించారు. ఈ తనిఖీలు సీఎంఆర్‌లో జాప్యం, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించినవని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి మిల్లర్లు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జగన్మోహన్, డీసీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ రాజు, డీటీ తదితరులు పాల్గొన్నారు.