
ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
వనపర్తి: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, వైద్యశాఖకు సంబంధించిన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎన్‌ఐసీ మందిరంలో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల 2 వరకు జరిగే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంపై చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. ప్రత్యేక వైద్య నిపుణులు ఎవరెవరు వచ్చారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 10 వేల పైచిలుకు వరకు పిల్లలు, మహిళలు ప్రత్యేక వైద్య పరీక్షలకు హాజరయ్యారని, రోజుకో స్పెషలిస్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హాజరై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి సమాధానమిచ్చారు. వైద్య నిపుణుడు వచ్చే ముందురోజు ప్రజలకు సమాచారం ఇచ్చి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వనపర్తి హెల్త్ పోర్టల్‌లో రోగుల వివరాలు నిక్షిప్తం చేసి వారికి సంక్షిప్త సందేశం అందించేందుకు సరైన వాట్సాప్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది 63 డెంగీ కేసులు నమోదయ్యాయని, డెంగీ ప్రబలిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారుల సహకారంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గర్భిణుల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా 5వ ఏఎన్‌సీ చెకప్ సైతం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వసతిగృహ విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించడానికి హెచ్‌బీ1సీ పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డా. చైతన్య, డా. సాయినాథ్‌రెడ్డి, డా. పరిమళ, డా. మంజుల పాల్గొన్నారు.