
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
వనపర్తి: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏ కార్యదర్శి లోకేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి నిషేధిత భూములు, రెవెన్యూ సదస్సు పెండింగ్ దరఖాస్తులపై చర్చించారు. జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వే ల్యాండ్ ఏడీ బాలకృష్ణ, ఏఓ భానుప్రకాష్, సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాదా బైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నిషేధిత భూముల జాబితాలోని అసైన్డ్, వక్ఫ్ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే కొత్త సర్వేయర్లు వచ్చారని.. జిల్లాలో ఉన్న అసైన్డ్, వక్ఫ్ భూములు సర్వే చేయించి ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 121 ప్రకారం నిర్ణీత ఫార్మెట్ పూరించి నివేదికలు పంపించాలని ఆదేశించారు.