
మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
పాన్‌గల్: మండలంలోని రేమద్దుల గ్రామ మైనింగ్ ప్రాంతాన్ని మంగళవారం మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గ్రామంలోని సర్వేనంబర్ 230, 232, 233, 234, 235, 251, 252 తదితర సర్వేనంబర్లలో ఉన్న 12.16 ఎకరాల తవ్వకాలకు ప్రభుత్వం 2005లోనే అనుమతినిచ్చింది. ప్రభుత్వం అనుమతినిచ్చిన సర్వేనంబర్లలో కాకుండా 243, 245లో కొంతవరకు తవ్వకాలు చేపట్టి అక్కడున్న గొల్లకుంటను ధ్వంసం చేశారని వాల్యానాయక్‌తండా రైతుల ఫిర్యాదు మేరకు పరిశీలించామని.. రైతులు, గ్రామస్తులతో వివరాలు, జీపీఎస్ యంత్రం ద్వారా మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించినట్లు అధికారులు వివరించారు. మధ్యాహ్నం నుంచి వర్షం కురవడంతో వివరాల సేకరణకు అంతరాయం ఏర్పడిందని.. మరోమారు సందర్శించి పూర్తి వివరాలు సేకరించి హద్దులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ సురేఖ, మైనింగ్ సర్వేయర్ సుజాత, ఆర్‌ఐ మహేష్, ఇన్‌చార్జ్ సర్వేయర్ శివకుమార్, జీపీఓ బాబు, వీఆర్‌ఏ మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.