
ఖాళీల భర్తీ ఎప్పుడో?
జిల్లా కార్మికశాఖ కార్యాలయానికి ఒకే ఒక్క జూనియర్ అసిస్టెంట్ దిక్కు
అధికారికే తెలుసు..
సిబ్బంది నియామకాల్లోనూ అదే పరిస్థితి..
● భర్తీకి నోచుకోని కీలక పోస్టులు
● ఇన్‌చార్జి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి
● క్షేత్రస్థాయిలో కార్మికులకు
అవగాహన కార్యక్రమాలు కరువు
వనపర్తిటౌన్: కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే కార్మికశాఖకు అధికారులు కరువయ్యారు. ఒకే ఒక్క జూనియర్ అసిస్టెంట్, మరొక అటెండర్‌తోనే జిల్లా కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయి అధికారులు లేకపోవడంతో కార్యాలయ నిర్వహణ వంతుకు గంతేసినట్లుగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన వేణుగోపాల్‌కు వనపర్తి జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన వారంలో మూడు రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో కార్మికులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. దీనికి తోడు పూర్తి బాధ్యత లు ఉన్న గద్వాల జిల్లాలో ముఖ్యమైన కార్యకలాపాలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం మానేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అసలు కార్మికశాఖలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీ..
కార్మికశాఖలో అత్యంత కీలకమైన పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లతో పాటు సీనియర్ ఆసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఫలితంగా కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్‌పై పనిభారం పెరగడంతో పాటు అసలు విధులు పడకేస్తున్నాయి. కీలకమైన బాధ్యతల్లో ఉండాల్సిన అధికారులు లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
పథకాల అమలులో జాప్యం..
కార్మికశాఖ ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అర్హులకు అందించడంలో జాప్యం తప్పడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల వేతన సమస్యలను గుర్తించి పరిష్కరించడం.. కార్మిక మండలి కొనసాగిస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకునేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అసంఘటిత రంగ కార్మికులకు సభ్యత్వాల నమోదు తదితర బాధ్యతలన్నీ సిబ్బంది కొరతతో మరుగున పడుతున్నాయి. అనేక మంది వ్యాపారులు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ కేవలం కొందరికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. అధికారులకు సైతం తప్పుడు సమాచారం అందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వారిపై విచారణ, చర్యల్లో జాప్యం నెలకొంటుంది.
కొరవడిన తనిఖీలు..
ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఆకస్మిక తనిఖీలు ఆగిపోయాయి. కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాల్సిన కీలక అధికారుల పోస్టుల ఖాళీ కలవరపెడుతోంది. ప్రధాన అంశాలపై నిరంతర అన్వేషణ ఉండటం లేదు. అధికారికంగా వచ్చే ఫిర్యాదులపై స్పందించే పరిస్థితులు కూడా అరకొరగానే కనిపిస్తున్నాయి.
కార్మికశాఖ
కార్యాలయం ఇదే
కార్యాలయంలో ఏ వివరాలు కావాలన్నా ఇన్‌చార్జిగా ఉన్న అధికారికే తెలుసు. కార్యాలయంలో మాకు కేటాయించిన విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నాం. ఇక్కడ నాతోపాటు ఒక అటెండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎంత మంది కార్మికులు ఉన్నారు.. ఎంత మందికి క్లెయిమ్స్ క్లియర్ చేశారనే వివరాలు ఇన్‌చార్జ్ అధికారికే తెలుసు. ఆయన ద్వారానే వివరాలు తీసుకోవాలి.
– రఫీ, కార్మికశాఖ జూనియర్ అసిస్టెంట్
ఉన్నతాధికారుల పోస్టులే కాదు.. కార్యాలయాల్లో సిబ్బంది నియామకాల్లోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జిల్లా కార్యాలయంలో కార్మికుల వివరాలు నమోదు చేయడం, వారి క్‌లైమ్స్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే డాటా ఆపరేటర్లు ఒక్కరు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. దీంతో శాఖాపరమైన కార్యకలాపాల నిర్వహణకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందు బాటులోకి రాలేదు.

ఖాళీల భర్తీ ఎప్పుడో?