
యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
గోపాల్‌పేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. సోమవారం వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కోసం గోపాల్‌పేట సింగిల్‌విండో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. తీరా సింగిల్‌విండో సిబ్బంది ప్రస్తుతం స్టాక్ లేదని.. మంగళవారం వస్తే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడి నుంచి వనపర్తి–హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నిత్యం యూరియా కోసం తిరుగుతున్నా ఒక బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. టోకెన్లు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వానాకాలం సాగుచేసిన పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పీఏసీఎస్ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఇప్పటికే 2వేల వరకు టోకెన్లు ఇచ్చామని.. మంగళవారం లోడ్ వచ్చిన తర్వాత మరింత మందికి టోకెన్లు అందిస్తామన్నారు. బుధవారం ఎక్కువ మొత్తంలో యూరియా రానుందని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.