
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
గోపాల్‌పేట: మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు అన్నారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం గోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ముందుగా పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ స్పెషలిస్టు డా.శ్రావణి 61మంది పిల్లలకు పరీక్షలు చేశారు. అందులో 44 మంది తక్కువ బరువుతో కూడి పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించారు. చిన్నారులకు అవసరమైన మందులు అందజేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఈ నెల 24, 26, 29, అక్టోబర్ 1న ఇతర వైద్యులతో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 24న నేత్ర వైద్యులు, 26న జనరల్ వైద్యులు, 29న చర్మ వైద్యులు, అక్టోబర్ 1న దంత వైద్యులు అందుబాటులో ఉంటారని.. మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా.చాంద్‌పాషా, సీహెచ్‌ఓ సిద్దగౌడ్, సూపర్‌వైజర్లు సుచిత్ర, కౌసల్య, వెంకటమ్మ, మధుబాబు పాల్గొన్నారు.