
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట
పెట్టుబడి ఇలా...
తగ్గిన దిగుబడి..
మొదటిసారికే పరిమితం..
● ఎండు, ఆకుమచ్చ తెగులుతో
తగ్గిన దిగుబడి
● జిల్లాలో 15,831 ఎకరాల సాగు
● ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు
అమరచింత: అధిక వర్షాలు, తెగుళ్లతో పత్తి పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాక సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఆశించిన దిగుబడి వస్తుందని ఆశించిన రైతన్నకు అప్పులు, కన్నీరే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూత, పిందెతో పాటు గూడ, కాయలు రాలుతోందని.. వ్యవసాయ అధికారులు సూచించిన మందులు పిచికారీ చేసినా ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా ఆగమయ్యాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 15,831 ఎకరాల్లో పత్తి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు సుమారు రూ.35 వేల వరకు పెట్టుబడి అయిందని.. పంట ఎండుముఖం పట్టి ఉన్న కొద్దిపాటి పత్తినైనా సకాలంలో అందుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యవసాయ కూలీలను ఇతర ప్రాంతాల నుండి రోజుకు రూ.450 కూలి ఇచ్చి కాసిన పత్తిని ఏరి ఇళ్లకు తరలించుకుంటున్నారు.
మండలం విస్తీర్ణం
(ఎకరాల్లో..)
అమరచింత 4,857
ఆత్మకూర్ 4,270
మదనాపురం 2,445
పెద్దమందడి 1,570
ఖిల్లాఘనపురం 1,483
కొత్తకోట 535
రేవల్లి 311
గోపాల్‌పేట 145
వనపర్తి 120
పెబ్బేరు 35
ఏదుట్ల 30
చిన్నంబావి 23
పాన్‌గల్ 4
శ్రీరంగాపురం 3
పత్తి సాగుకు ఎకరాకు రూ.35 వేలు.. కౌలు రైతులకై తే రూ.45 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. పొలం దున్నడానికి రూ.2 వేలు, సాలు కొట్టడానికి రూ.2,500, విత్తనానికి రూ.3 వేలు ఖర్చు అవుతుండగా.. కూలీలకు రెండు పర్యాయాలకు రూ.8 వేలు, ఎరువులకు రూ.12 వేలు, మందుల పిచికారీ మూడు పర్యాయాలకు రూ.9 వేల వరకు అవుతుందని వివరించారు. వీటితో పాటు పత్తి ఏరేందుకు అయ్యే ఖర్చు వీటికి రెట్టింపు అవుతుందంటున్నారు.
ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న అంచనాలతో రైతులు పత్తి సాగు చేశారు. కాసిన పత్తి కాయలు అధిక వర్షాలకు రాలిపోవడం, మిగిలిన కాయల నుంచి వచ్చే పత్తి కేవలం ఎకరాకు 2 క్వింటాళ్ల వరకు మాత్రమే చేతికందే పరిస్థితి నెలకొంది. ఈసారి మార్కెట్‌లో పత్తికి ఆశించిన ధర లేకపోవడంతో వచ్చిన పత్తిని ఇంటికి తరలించి భద్రపర్చుకుంటున్నారు. మార్కెట్‌లో క్వింటాకు రూ.7 వేల వరకు ఉండగా దళారులు కేవలం రూ.5,500 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతన్నలు భారీగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.15 నుంచి రూ.20 వేల వరకు నష్టం వాటిల్లుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణం అనుకూలిస్తే రెండు, మూడు పర్యాయాలు పత్తి ఏరుకునే అవకాశం ఉండేది. కాని ఈసారి పూర్తిగా దెబ్బతినడంతో ఒకసారి మాత్రమే పత్తి ఏరుకునే వీలుందని రైతులు చెబుతున్నారు.

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట

అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట