క్రీడాకారులకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు ప్రోత్సాహం

Sep 22 2025 9:54 AM | Updated on Sep 22 2025 9:54 AM

క్రీడ

క్రీడాకారులకు ప్రోత్సాహం

వనపర్తి: ప్రతిభ కనబర్చే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమంగా రాణించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ కే.శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న 11వ అంతర్‌ జిల్లా సీనియర్‌ మెన్స్‌ అండ్‌ ఉమెన్స్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్‌, ఉమెన్స్‌ జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో క్రీడలకు రూ.800 కోట్లు కేటాయించిందన్నారు. క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేలా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. సెపక్‌తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్‌ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్‌ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్‌ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానం ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్‌ స్కూల్‌ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదివనపర్తిలో ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే వరకు శ్రమించాలని.. గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలంపిక్స్‌లో పతకం సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

విద్యతో పాటు క్రీడలకు జిల్లా నిలయం

ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి విద్యాపర్తి మాత్రమే కాదని, క్రీడలకు కూడా నిలయమన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి ఇక్కడి వారే కావడం, రాష్ట్ర క్రీడా మంత్రి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వాసే కావడం ఎంతో గర్వించదగిన విషయమని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కూడా క్రీడలపై మక్కువ ఎక్కువని.. ఇక్కడే చదువుకొని అనేక క్రీడల్లో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా హైదరాబాద్‌లోని క్రీడా ప్రాధికార సంస్థకు వెళ్లి కలవాలని సూచించారు. వనపర్తి జిల్లాకు స్పోర్ట్స్‌ స్కూల్‌ , పెద్దమందడి, ఖిల్లా ఘనపురం మండలాలకు మినీ స్టేడియం మంజూరు చేసిన ముఖ్యమంత్రి, క్రీడా స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో 9 ఎకరాల్లో క్రికెట్‌ మైదానం కోసం స్థలాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. సెపక్‌తక్రా క్రీడల్లో రాణించి ఇన్‌కం టాక్స్‌ విభాగంలో ఉద్యోగం సంపాదించిన ఖిల్లాఘనపురం అమ్మాయి నవతను అభినందించారు. ఇదిలా ఉండగా క్రీడలకు వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షత వహించగా.. పోటీల ప్రారంభానికి ముందు ప్రముఖ క్రీడాకారుడు, హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి క్రీడా జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సెపక్‌తక్రా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి పబ్బ భాస్కర్‌గౌడ్‌, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మేఘారెడ్డి,

స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి

అట్టహాసంగా ప్రారంభమైన

11వ అంతర్రాష్ట సెపక్‌తక్రా పోటీలు

రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్న 20 జట్లు

క్రీడాకారులకు ప్రోత్సాహం 1
1/1

క్రీడాకారులకు ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement