
త్వరలో డీసీసీ సారథుల నియామకం?
వనపర్తి రేసులో ఇరుపక్షాల నేతలు
పట్టం కట్టేదెవరికో..?
వనపర్తి: కొంతకాలంగా అధికార కాంగ్రెస్‌పార్టీలో చర్చనీయాంశంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకంపై దసరాలోగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు క్యాడర్ చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్‌య్రా పార్టీ జిల్లా సారఽథులను నియమించి వారి సేవలను పార్టీ అభ్యర్థుల గెలుపునకు వినియోగించుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా.. జిల్లా విషయానికొస్తే అధ్యక్ష పదవిలో రేసులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి వర్గీయులు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ని మరోమారు కొనసాగించాలనే ప్రతిపాదన చిన్నారెడ్డి రాష్ట్ర, కేంద్ర కమిటీల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాదంటే.. ఓ న్యాయవాది, మరో రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్ నాయకుడి పేర్లు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇనాళ్లు ఓ లెక్క.. నేను పార్టీలో చేరాక మరోలెక్క అన్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ పెద్దలను ఒప్పించి టిక్కెట్ తెచ్చుకొని అన్యూహ్యంగా ఇచ్చిన మాట ప్రకారం బలమైన నాయకుడిపై భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు పార్టీలో చేరి తన గెలుపునకు కీలకపాత్ర పోషించిన సన్నిహిత మిత్రుడు, మాజీ కౌన్సిలర్, మాజీ ఎంపీపీ ముగ్గురి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో ఎవరు డీసీసీ పీఠం దక్కించుకుంటారో తెలుసుకోవాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే.
పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి ప్రయత్నాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే
ప్రకటించే అవకాశం
ఇటీవల స్థానిక నేతలతో
ముఖ్యమంత్రి చర్చించినట్లు ప్రచారం
గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పాటించగా.. అదే విధానాన్ని డీసీసీ అధ్యక్షుల నియామకంలోనూ కేంద్ర, రాష్ట్ర పెద్దలు కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కొనసాగితే డీసీసీ పీఠం ఎమ్మెల్యే వర్గీయులకే దక్కడం ఖాయమని చెప్పవచ్చు. ఈ విషయంలో జిల్లాలో భాగస్వాములైన కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సైతం ఎమ్మెల్యే ప్రతిపాదననే బలపర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో డీసీసీ పీఠం ఎమ్మెల్యే వర్గీయులకు దక్కడం లాంచనప్రాయమేనని పార్టీ శ్రేణుల్లో చర్చ వినిపిస్తోంది.