
సీఎంఆర్ పూర్తయిన మిల్లులకే ధాన్యం
● రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్
వనపర్తి: ఇప్పటి వరకు సీజన్ల వారీగా సీఎంఆర్ అప్పగించి బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లులకే 2025–26 వానాకాలం వరి ధాన్యం కేటాయిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2025–26 వానాకాలానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 430 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈసారి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు అంచనా వేస్తున్నామని.. మిల్లర్లకు ఇబ్బంది కలగకుండా క్లీనర్లు ఏర్పాటు చేయించి ధాన్యం శుభ్రం చేయడంతో పాటు నిర్దేశించిన తేమశాతం వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డిఫాల్ట్ మిల్లర్లు బకాయి సీఎంఆర్ అప్పగిస్తేనే కొత్తగా ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ నవంబర్ 12లోగా ఇవ్వాలని సూచించారు. మిల్లర్లు వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మాత్రమే దింపుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.