
ఆగని అన్నదాతల ఆందోళన
పాన్‌గల్: వ్యవసాయ పనులు నిలిపివేసి రోజుల తరబడి యూరియా కోసం సింగిల్‌విండో కార్యాలయానికి తిరుగుతున్న లభించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం పాన్‌గల్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వారికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్, సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే యూరియా కష్టాలు వచ్చాయని.. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. రాస్తారోకోతో రహదారిపై వాహనాలు గంటకు పైగా నిలిచిపోయాయి. ఎస్‌ఐ శ్రీనివాస్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ భాస్కర్‌గౌడ్, ఇన్‌చార్జ్ ఏఓ డాకేశ్వర్‌గౌడ్ అక్కడికి చేరుకొని మాట్లాడారు. ఇప్పటి వరకు సింగిల్‌విండో ద్వారా 21 వేల బస్తాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా 14 వేల బస్తాల యూరియా పంపిణీ చేశామని, ఇంకా 1,500 బస్తాలు వస్తుందని, రాగానే టోకన్లు పొందిన రైతులకు అందజేస్తామని, ఆందోళన చెందవద్దని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.