
భూ సర్వే వేగవంతం చేయాలి
వనపర్తి: భూ రికార్డులు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వేయర్లు భూ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాలోని వివిధ మండలాల సర్వేయర్లతో భూ సర్వే, భూ సమస్యల పరిష్కారంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎఫ్–లైన్ దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. అసైన్డ్, భూ దానం, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఏఐ మ్యాపింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని సూచించారు. సర్వే పనులు సకాలంలో పూర్తి చేయడంతోనే రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతమవుతుందన్నారు. సమావేశంలో ఏడీ సర్వే ల్యాండ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశిత సమయానికి పంట కోతలు చేపట్టాలి..
కోత యంత్రాల నిర్వాహకులు వానాకాలం వరి కోతల్లో అధికారుల సూచనలు పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో పాటు కోత యంత్రాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు పచ్చిగా ఉన్నప్పుడే కోతలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, తేమ శాతం కీలకమన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ కాశీవిశ్వనాథం, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి..
2024–25 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ గడువులోగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం వనపర్తి మండలం చిట్యాల శివారులోని పారాబాయిల్డ్ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, ఇప్పటి వరకు సరఫరా చేసిన బియ్యం వివరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎంఆర్ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు. సకాలంలో సీఎంఆర్ అప్పగించేందుకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. మిల్లర్లు కూడా తమవంతు కృషి చేయాలని కోరారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్