
అదానీ సిమెంట్ కంపెనీ వద్దే వద్దు
డాబాగార్డెన్స్: గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాల్లో అదానీ సంస్థ 40 లక్షల సామర్థ్యంతో తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదనను రద్దు చేయాలని జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మంగళవారం కోరారు. సిమెంట్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదన రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, వెంటనే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. ప్రతిపాదిత సిమెంట్ కంపెనీ వల్ల గాజువాక, పెదగంట్యాడ, కూర్మన్నపాలెం ప్రాంతాలు దుమ్ము, ధూళి, విష కణాలతో నిండిపోతాయని, తాగునీరు కాలుష్యానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు శ్వాసకోశ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అదానీ గంగవరం పోర్టు కారణంగా గాజువాక పరిసర ప్రాంతాలు బొగ్గు, ధూళితో తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయని వివరించారు. సిమెంట్ కంపెనీ కోసం కేటాయించిన 20 ఎకరాల భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఇచ్చారని, ఈ భూమిలో ఇతర కంపెనీ నిర్మాణం చట్ట విరుద్ధమని, భూ ఒప్పందం కూడా చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని.. నగర పౌరుల తరపున సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జీవీఎంసీ కమిషనర్‌కు అందజేసిన వినతిప్రతంలో విజ్ఞప్తి చేశారు. అలాగే జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ బి.గంగారావు, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్‌తో కలిసి ఆయన మేయర్ పీలా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు.
జీవీఎంసీ కమిషనర్‌కు
వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వినతి