
అధికారుల నిర్లక్ష్యమే బలిగొంది..
సత్తిబాబు కుటుంబానికి
న్యాయం చేయాలని ఆందోళన
మహారాణిపేట/మర్రిపాలెం: జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ లైన్‌మన్ సత్తిబాబు (47) మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సోమవారం విద్యుదాఘాతంతో సత్తిబాబు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులు స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. : సోమవారం సాయంత్రం మురళీనగర్ ప్రాంతంలో సత్తిబాబు తన హెల్పర్‌తో కలిసి వీధి దీపాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్తంభం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో ఆయన షాక్‌కు గురై కిందపడిపోయారు. సహచర ఉద్యోగులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తోటి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి వీధి దీపాల మరమ్మతులు చేయాల్సిన రెగ్యులర్ సిబ్బంది రావడం లేదు. వారితో పనులు చేయించకుండా, మాతో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు. సత్తిబాబు మరణానికి జీవీఎంసీ అధికారులదే పూర్తి బాధ్యత’అని వారు ఆరోపించారు. ఉద్యోగి చనిపోయి గంటలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి కనీసం పరామర్శించడానికి రాకపోవడంపై వారు మండిపడ్డారు. మృతుడు సత్తిబాబుకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.