
స్నేహితుడిపై చాకుతో దాడి
డబ్బుల కోసం వివాదం
యువకుడి అరెస్ట్
పెదగంట్యాడ: స్నేహితుడిపై చాకుతో దాడి చేసి న యువకుడిని అరెస్ట్ చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన కుప్పిలి మణిదీప్, మిందికి చెందిన ఉంగరాల దినేష్ స్నేహితులు. వీరిద్దరూ తరచుగా కలిసి మద్యం సేవిస్తుంటారు. నెల రోజుల కిందట దినేష్ లంకెలపాలెంలోని ఓ ఫార్మా కంపెనీలో దినసరి కూలీగా మణిదీప్‌ను పనిలో చేర్చాడు. అయితే మణిదీప్ వారం రోజులకే పని మానేశాడు. ఆ వారం రోజుల వేతనాన్ని కాంట్రాక్టర్ దినేష్‌కు ఇచ్చాడు. ఈ డబ్బులు ఇవ్వాలని మణిదీప్ పదేపదే అడగడంతో, ఆగ్రహానికి గురైన దినేష్ అతడిని చంపుతానని బెదిరించాడు. ఈ నెల 2వ తేదీన.. మణిదీప్‌ను అక్కిరెడ్డిపాలెం చెరువు వద్దకు రమ్మని దినేష్ ఫోన్ చేసి పిలిచాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరూ చెరువు వద్ద కలుసుకున్నారు. ఆ తరువాత మణిదీప్ తన డబ్బులు ఇవ్వాలని అడగడంతో.. దినేష్ తనతో పాటు తెచ్చుకున్న చాకుతో మణిదీప్‌పై దాడి చేశాడు. మణిదీప్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో దినేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మణిదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్ధసారధి కేసు నమోదు చేశారు. నిందితుడైన దినేష్‌ను మంగళవారం శ్రీనగర్ బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ సూర్యకళ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.