
చిట్టీల సొమ్ము రూ.కోటితో భార్యాభర్తలు పరార్
కొమ్మాది: చిట్టీల పేరుతో సుమారు కోటి రూపాయల సొమ్మును వసూలు చేసి భార్యాభర్తలు పరారైన సంఘటన ఎండాడలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో సందీపిని నగర్‌లోని స్వగృహ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వై.రమణమ్మ చిట్టీలు వేస్తోంది. ఈ క్రమంలో ఆమె గత కొన్నేళ్లుగా స్థానికుల నుంచి సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేసింది. చిట్టీల కాలపరిమితి దగ్గరపడుతుండటంతో.. బాధితులు నాలుగు నెలలుగా ఆమెను డబ్బు అడుగుతున్నారు. అయితే, ఆమె సమయం దాటవేస్తూ వస్తోంది. బాధితులందరూ మూకుమ్మడిగా వచ్చి తమ డబ్బులు అడగగా.. రమణమ్మ తన భర్త ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అని, తమను ఇబ్బంది పెడితే వివిధ కేసులు బనాయిస్తానని హెచ్చరించింది. దీంతో బాధితులు ఇటీవల పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ప్రస్తుతం రమణమ్మ, ఆమె భర్త పరారీలో ఉన్నారు. మంగళవారం రమణమ్మ ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేశారు. పరారీలో ఉన్న రమణమ్మను పట్టుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని పీఎంపాలెం పోలీసులను కోరారు. ప్రస్తుతం ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.