
గిరిజన బిడ్డల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే...
కేజీహెచ్‌లో విద్యార్థినులను
పరామర్శించిన షర్మిల
మహారాణిపేట: కురుపాం గురుకుల విద్యార్థినుల మరణం పట్ల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం ఆమె పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గిరిజన బిడ్డల మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ హాస్టల్లోనూ ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని, వందల మంది విద్యార్థినులకు ఒకే బాత్రూం ఉండటం దారుణమని విమర్శించారు. తాను ‘గుడితో పాటు బడి ముఖ్యం’అని గతంలో చేసిన వ్యాఖ్యలకు మతం రంగు పులిమి తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే ఒక హైలెవల్ కమిటీ వేయాలని, రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను బాగుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.