మంచు కొండల్లో విడిది! | - | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో విడిది!

Oct 8 2025 6:05 AM | Updated on Oct 8 2025 6:05 AM

మంచు

మంచు కొండల్లో విడిది!

లంబసింగిలో 15 డోమ్‌ రిసార్టులు రూ.5.33 కోట్లతో ప్రణాళికలు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన ఏపీటీడీసీ మూడు నెలల్లో ప్రాజెక్టు పూర్తికి చర్యలు గత ప్రభుత్వ హయాంలో డోమ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు వాటిని మార్పు చేసి రిసార్టులుగా డిజైన్‌ చేసిన అధికారులు

సాక్షి, విశాఖపట్నం: ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్‌లో బస చేయడం సాధారణం. ఎంత విలాసవంతమైన హోటల్‌ అయినా అది నాలుగు గోడల మధ్యే ఉంటుంది. కానీ.. ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు.. ప్రకృతి మన చుట్టూ ఆవరించినట్లు.. విశాలమైన మంచంపై పడుకుని కళ్లు తెరిస్తే.. ఆ ఊహాలోకం మన చెంతనే ఉన్నట్లు అనిపిస్తే.. ఆ అనుభూతే వేరు కదా! అలాంటి అద్భుత అనుభవాన్ని అందించేందుకు అందాల లంబసింగిలో సరికొత్త పర్యాటక రిసార్టులు రాబోతున్నాయి. వీటినే ‘జియోడెసిక్‌ డోమ్‌ రిసార్టులు’ అంటారు. వీటి నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) టెండర్లను ఆహ్వానించింది.

లంబసింగిలో కొత్త ఆకర్షణ

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో ఏపీటీడీసీకి ఇప్పటికే రిసార్టులు ఉన్నాయి. వాటి పక్కనే ఈ సరికొత్త జియోడెసిక్‌ డోమ్‌ గ్లాంపింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలు, రెస్టారెంట్‌కు అదనంగా ఈ డోమ్‌ రిసార్టులను ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊటీని తలపించే శీతల వాతావరణం, చుట్టూ అల్లుకునే దట్టమైన పొగమంచుకు లంబసింగి ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారికి సరికొత్త వసతి అనుభవాన్ని అందించేందుకు ఏపీటీడీసీ శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డోమ్‌ రెస్టారెంట్‌ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా.. ప్రస్తుత అధికారులు ఆ ప్రాజెక్టుకు మెరుగులు దిద్ది, పూర్తి స్థాయి డోమ్‌ రిసార్టులు తీసుకురావాలని నిర్ణయించారు.

మూడు నెలల్లో నిర్మాణం పూర్తి

లంబసింగికి దేశ, విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు డోమ్‌ రిసార్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించాం. కాంట్రాక్టు ఖరారైన మూడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని నిబంధన విధించాం. భూమికి సంబంధించిన అనుమతుల నుంచి నిర్మాణం పూర్తి చేసి, వినియోగానికి సిద్ధంగా ఉన్న స్థితిలో అప్పగించే వరకు పూర్తి బాధ్యత ఎంపికై న కాంట్రాక్టర్‌దే. ఇవి అందుబాటులోకి వస్తే ఏజెన్సీలో మరింతగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.

– జీవీబీ జగదీష్‌, ఏపీటీడీసీ డివిజనల్‌ మేనేజర్‌

రూ. 5.33 కోట్లు.. 15 డోమ్‌ యూనిట్లు..

ప్రకృతిని వీక్షించడానికి, ఆస్వాదించడానికి వీలుగా.. పర్యాటకుల ఏకాంతానికి భంగం కలగకుండా కొండ ప్రాంతంలో ఈ జియోడెసిక్‌ డోమ్‌ రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. రూ.5.33 కోట్ల వ్యయంతో మొత్తం 15 డోమ్‌ రిసార్టులను నిర్మించనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ ఆర్‌ఎఫ్‌పీ(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) ఆహ్వానించింది. జియోడెసిక్‌, పుట్టగొడుగు ఆకారపు డోమ్‌లతో పాటు, అథారిటీ ఆమోదించిన మరికొన్ని విభిన్న నమూనాల్లో రిసార్టులను నిర్మిస్తారు. వీటికి రెయిలింగ్‌ సపోర్ట్‌తో కూడిన బేస్‌మెంట్‌ ఉంటుంది. ఫ్రంట్‌ ఎండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ డిజైన్‌ (ఫీడ్‌) ఆధారంగా.. పర్యావరణానికి హాని కలగని రీతిలో.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్నది ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ప్రస్తుత కాటేజీలకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో, అలాగే రిసార్ట్‌ నిర్మాణాల పైన ఉన్న ఎత్తైన ప్రదేశంలో వీటిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో డోమ్‌ యూనిట్‌ 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడే 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల కోసం ఆటస్థలం కూడా నిర్మించనున్నారు. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్ల ఈవీ బగ్గీలు రెండు అందుబాటులో ఉంచుతారు. ప్రతి డోమ్‌లో 7/6 బెడ్‌, రాకింగ్‌ చైర్‌, 3/3 సైడ్‌ టేబుల్స్‌, వార్డ్‌రోబ్‌, లగేజ్‌ ర్యాక్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, నాలుగు కుర్చీలతో కూడిన కాఫీ టేబుల్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

మంచు కొండల్లో విడిది!1
1/3

మంచు కొండల్లో విడిది!

మంచు కొండల్లో విడిది!2
2/3

మంచు కొండల్లో విడిది!

మంచు కొండల్లో విడిది!3
3/3

మంచు కొండల్లో విడిది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement