
సవాల్ విసిరిన అమాత్యులకే చెమటలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్ కాలేజీలపై సవాల్ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.