
లోన్‌యాప్ బాధితులకు రికవరీ సొత్తు అందజేత
విశాఖ సిటీ: ఇన్‌స్టంట్ ఫ్రాడ్ లోన్ యాప్స్ ద్వారా మోసపోయిన బాధితులకు.. కోల్పోయిన మొత్తాన్ని అందించేందుకు రెండో దఫా రిఫండ్ మేళా నిర్వహించినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ ఫ్రాడ్ లోన్ యాప్స్ ఉచ్చులో అనేక మంది అమాయకులు చిక్కుకుని రూ.లక్షలు నష్టపోతున్నారన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు దర్యాప్తు చేసి ఇప్పటి వరకు రూ.60 లక్షల క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు చెప్పారు. ఆ మొత్తంలో రూ.48 లక్షలను రూ.100 మంది బాధితులకు తొలి దశలో అందజేసినట్లు వెల్లడించారు. రెండో దఫా రిఫండ్ మేళా ద్వారా 26 మంది బాధితులకు రూ.8 లక్షలు అందజేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ(క్రైమ్) లతామాధురి, ఏసీపీలు పాల్గొన్నారు.
‘ఎల్‌ఆర్‌ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
విశాఖ సిటీ : అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ సూచించారు. 2025 జూన్ 30 ముందు అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దీని ద్వారా చట్టబద్ధమైన భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చన్నారు. లేఅవుట్లలో మౌ లిక సదుపాయాలతో పాటు భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా నిర్దేశిత డాక్యుమెంట్లతో స్వయంగా గానీ లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఎంఆర్‌డీఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
10న జాబ్‌మేళా
కంచరపాలెం: వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న సుమారు 100 ఉద్యోగాల భర్తీకి స్థానిక నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ)లో ఈ నెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సెంటర్ ఉప ప్రాంతీయ అధికారి నిట్టాల శ్యామ్‌సుందర్ తెలిపారు. రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్, టీం లీడర్స్, ఆఫీసర్, బీపీవో, టెలీకాలర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత సాఽధించిన 18–30 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు. జాబ్ లోకేషన్ ఏపీలోని పలు జిల్లాల్లో ఉంటుందన్నారు.