
కేజీహెచ్ నుంచి గిరిజన విద్యార్థినుల డిశ్చార్జి
మహారాణిపేట: పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థినులను మంగళవారం పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విద్యార్థినులకు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో, వైద్యుల నివేదికల ప్రకారం తరలించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్(గ్యాస్ట్రో ఎంట్రాలజీ), డాక్టర్ శివ కల్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు)లతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 129 మంది విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది.