
చంద్రబాబుకు దశితులంటే చిన్నచూపు
తిరుపతి మంగళం : ‘చంద్రబాబుకు దళితుంటే చిన్నచూపు, అందుకే దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని వ్యాఖ్యానించారు. అందుకే అంబేడ్కర్ విగ్రహాలకు నిప్పు పెట్టినా పట్టించుకోరు.. దళితులపై దాడులు జరిగినా స్పందించరు’’ అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంల దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహ దహనంపై కక్షపూరిత రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. విగ్రహం కాల్చిన దుండగులను వదిలేసి, ఫిర్యాదు చేసిన సర్పంచ్ గోవిందయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం రెడ్‌బుక్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తూరు ఎస్పీ మాట్లాడుతూ అది స్వల్ప విషయమంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలీసులు కేవలం పచ్చనేతల మెప్పుకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ బుక్‌లో దళితులకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేస్తామని, చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన నారాయణస్వామిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపాలని అనేక కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు దేవళంపేటలో సర్పంచ్ గోవిందయ్యపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత సతీష్‌నాయుడే అంబేడ్కర్ విగ్రహాన్ని తగులబెట్టించాడని తెలిసినా పచ్చనేతల మెప్పు కోసం చిత్తూరు ఎస్పీ కుట్రపూరితంగా గోవిందయ్యపై కేసులు పెట్టారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టనీయకుండా టీడీపీ నేత సతీష్‌నాయుడు అడ్డుకున్నారన్నారు. ఎమ్మెల్యే థామస్ ఏనాడైనా దళితుల కోసం పోరాటాలు చేశారా? ఎక్కడైనా ఒక్క అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు కోసం దళితుడని అని చెప్పుకునే థామస్ తిరుమలకు వెళ్లినప్పుడు క్రిస్టియన్‌గా డిక్లరేషన్ ఇవ్వడంలోనే నిజ స్వరూపం తెలుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తాను రూ. వేల కోట్లు అవినీతి చేశానంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చంద్రబాబు, పవన్‌కల్యాణ్ అంటరానివారిగానే చూస్తున్నారన్నారు. ఈ మేరకు దళితులంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అజయ్‌కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర, నల్లాని బాబు, రామయ్య, కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, ఎస్పీ విభాగం నగర అధ్యక్షుడు చేజర్ల మురళి పాల్గొన్నారు.