
ముక్కంటీ.. కనవేంటి!
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల వైఖరి సరికాదని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన శ్రీకాళహస్తీశ్వరాలయ కమిటీ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులుతో కలిసి ఆలయ సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముక్కంటీశుని సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా నాలుగో గేట్ నుంచి వచ్చే భక్తులు ఎండలో ఇబ్బంది పడుతున్నారని కార్పెట్ వేశారని, తర్వాత రోడ్డుపై కూల్ పెయింట్ వేయించారని, అనంతరం కొబ్బరి మట్టలతో పందిరి వేశారని చివరకు రేకుల షెడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ పని ముందుగానే చేసి ఉండవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్లకు నగదు దోచిపెట్టేందుకే మొత్తం వ్యవహారం నడిపించారని విమర్శించారు. అయితే భక్తుల కోసం వేసిన షెడ్లలో వాహనాలు పార్క్ చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన షెడ్లు కేవలం వాహనాల పార్కింగ్‌కే ఉపయోగపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికై నా ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి ఎండలో భక్తులు పడుతున్న ఇక్కట్లను గమనించాలని సూచించారు. షెడ్లలో ఎవరూ వాహనాలు పార్క్ చేయకుండా చర్యలు చేపట్టాలని కోరారు.