రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచిక ఈ దీపాల పండుగ అని పేర్కొన్నారు. ఆధునిక కాలపు దురాచారాలను జయించి, శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఈ పండుగ స్ఫూర్తి కలిగిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావడానికి ఈ పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు మరింతగా రావాలని ఈ శుభ సందర్భంగా గవర్నర్ ప్రార్థించారు.
ప్రజల జీవితాల్లో ప్రగతి వెల్లివిరియాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలతోపాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. తెలంగాణ మాదిరి దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. బాణాసంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని కోరారు.