
భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త దురాగతం
మహబూబ్‌నగర్ క్రైం: ప్రేమించి పెళ్లాడిన భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే కారణంతో భర్త కిరాతకుడిగా మారాడు. సోమశిల చూసొద్దామ ని ఆమెను నమ్మించి అడవిలోకి తీసుకువెళ్లి చున్నీతో గొంతు నులిమి ఆపై కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్–మారేడు మానుదిన్నె అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన నిందితుడి లొంగుబాటుతో వెలుగులోకి వచ్చింది.
రాంగ్ నంబర్‌తో కలిసి.. ప్రేమపెళ్లి చేసుకొని
మహబూబ్‌నగర్ టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూర్‌కు చెందిన శ్రావణి (27)కి రాంగ్ నంబర్ ద్వారా ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకొనే క్రమంలో ప్రేమలో పడి 2014లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక బాబు, పాప ఉన్నారు. అయితే తొలి నుంచీ శ్రావణి ప్రవర్తనపై శ్రీశైలం అనుమానం పెంచుకున్నాడు.
పెళ్లయిన కొంతకాలానికి భర్త, పిల్లలను వదిలేసి శ్రావణి తన అక్క భర్తతో వెళ్లిపోయింది. ఏడాది క్రితమే మళ్లీ భర్త వద్దకు రాగా ఆమెను భార్యగా శ్రీశైలం అంగీకరించాడు. దీంతో శ్రావణి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అంబేడ్కర్‌నగర్‌లో ఇద్దరు పిల్లలతో నివసిస్తుండగా.. శ్రీశైలం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో హాస్టల్‌లో ఉంటూ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు.
భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో..
శ్రావణి తరచూ ఫోన్లు మాట్లాడటం, చాటింగ్ చేయడం గమనించిన శ్రీశైలం ఆమెతో గొడవపడ్డాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో పథకం ప్రకారం ఆమెను హత్య చేసేందుకు ఈ నెల 21న హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నాడు. ఆమెకు ముందురోజు రాత్రి ఫోన్ చేసి ఉదయం సోమశిలకు వెళ్దామని చెప్పాడు. ఆమె పిల్లలిద్దరినీ బడికి పంపగా స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకొచ్చిన శ్రీశైలం.. తన భార్యతో కలిసి సోమశిలకు పయనమయ్యాడు.

పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్‌కు చేరుకున్నాక సీతాఫలం పండ్లు ఉంటాయని చెప్పి భార్యను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడే చున్నీని ఆమె మెడకు చుట్టి గొంతు నులిమాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచాడు. భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్నాక వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగలపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
తన కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి చంద్రయ్య మహబూబ్‌నగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అంతలోనే శ్రీశైలం లింగాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో హత్యోదంతం వెలుగులోకి వచి్చంది. అక్కడి పోలీసులు ఈ సమాచారాన్ని పెద్ద కొత్తపల్లి పోలీసులకు అందించగా వారు వెళ్లి నిందితుడిని విచారిస్తున్నారు.