జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వానమా? | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వానమా?

Oct 5 2025 5:06 AM | Updated on Oct 5 2025 5:06 AM

జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వానమా?

జిల్లా కేంద్రంలోనే ఇంత అధ్వానమా?

పుట్టపర్తి టౌన్‌: ‘‘రోడ్డుపై మురుగు పారుతోంది. ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోంది. మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి. ఇది జిల్లా కేంద్రం అని చెప్పకునేందుకు సిగ్గుగా ఉంది. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నా...అధికారులు మేల్కోవడం లేదు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ‘స్వచ్ఛ సర్వేక్షన్‌’లో పుట్టపర్తికి 123వ ర్యాంక్‌ దక్కింది. గతంలో రాష్ట్రంలోనే 4వ ర్యాంక్‌ సాధించిన పుట్టపర్తికి... ఇప్పుడు 123 ర్యాంక్‌ రావడం ఏమిటి.. ఈ ర్యాంక్‌ను బట్టి అధికారుల పనితీరు అర్థమవుతోంది’’ అంటూ వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు అధికారుల పనితీరును తూర్పారబట్టారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబుళపతి అధ్యక్షతన, కమిషనర్‌ క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ... తమ వార్డుల్లో వీధిలైట్లు వెలగడం లేదని... ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నాయని, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

ప్రొటోకాల్‌ కూడా పాటించరా..?

అనంతరం వైస్‌ చైర్మన్‌ తిప్నన్న మాట్లాడుతూ... అధికారులు కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించండం లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిలర్లను ఆహ్వానించడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. కానీ అభివృద్ధి పనుల ఆమోదం కోసం మాత్రం తాము కావాల్సి వచ్చామా..అంటూ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ రత్నచౌదరి కలుగజేసుకుంటూ... మర్యాదలేనప్పుడు రాజీనామా చేయాలన్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లంతా ఆయనపై ధ్వజమెత్తారు. తమను ప్రజలు గెలిపించి కౌన్సిల్‌కు పంపారని, ఇలా ఎవరు పడితే వారు రాజీనామా కోరడం తగదన్నారు. అసలు తమను రాజీనామా చేయాలని కోరే హక్కు నీకెక్కడ ఉందంటూ రత్న చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో కౌన్సిల్‌ కాసేపు రసాబాసగా మారింది. మిగిలిన కౌన్సిలర్లు సర్దిచెప్పడంలో అందరూ శాంతించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ తుంగా ఓబుళపతి మాట్లాడుతూ... ప్రొటోకాల్‌ పాటించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఇందులో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్న కౌన్సిల్‌ చైర్మన్‌గా తన అధికారం తాను ఉపయోగిస్తానని హెచ్చరించారు. ఇక నుంచైనా ప్రొటోకాల్‌ పాటిస్తూ కౌన్సిలర్లకు గౌరవం ఇవ్వాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ... ప్రొటోకాల్‌ తప్పకుండా పాటిస్తామన్నారు. వీధిలైట్లు కూడా తీసుకొచ్చామని, బాబా శతజయంతి ఉత్సవాలకు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వార్డుల పునర్విభజనకు ఆమోదం

పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో పాటు జనాభా, కాలనీలు పెరిగిన దృష్ట్యా వార్డుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వార్డుల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 27కు పెంచాలని తీర్మానించగా..కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

మునిసిపాలిటీ దుస్థితికి

123వ ర్యాంకు అద్దం పడుతోంది

కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో సభ్యుల మండిపాటు

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై నిలదీత

వార్డుల పెంపునకు ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement