
ఉల్లి రైతుల గోడు పట్టదా బాబూ?
రొద్దం: దళారులకు మద్దతు తెలుపుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించే రైతులను నిండా ముంచుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ముఖ్యంగా ఉల్లి రైతు గోడు చంద్రబాబు పట్టడం లేదన్నారు. శనివారం ఆమె మండలంలోని సానిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలో ఉన్న ఉల్లిని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి పెట్టుబడి...దిగుబడి...ప్రస్తుతం మార్కెట్‌లో ధర గురించి ఆరా తీశారు. పెట్టుబడి కూడా దక్కడం లేదని తెలిసి రైతులతో కలిసి గొబ్బరంపల్లి–సానిపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేట్టారు. ఉల్లి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతును రాజుగా చూడాలని ఆకాంక్షించారని, నేడు చంద్రబాబు హయాంలోనే కూటమి సర్కార్ రైతును రోడ్డున పడేసేందుకు సిద్ధమైందన్నారు. దళారులకు పెద్దపీట వేస్తూ రైతులను దగా చేస్తోందన్నారు. ఫలితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. ఉల్లి మొదులుకుని టమాట, మొక్కజొన్న తదితర ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. అలాగే ఉల్లి రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమ్మ తిమ్మయ్య, మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, సోమందేపల్లి మండల కన్వీనర్, స్థానిక ఎంపీటీసీ శంకర్‌రెడ్డి, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, చిలకల రవి, పలువులు ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
కొంటామని మాటిచ్చి చేతులెత్తేస్తారా?
కూటమి సర్కార్‌పై ఉషశ్రీచరణ్
మండిపాటు
మద్దతు ధర కల్పించాలని
రైతులతో కలిసి ధర్నా