
రైతుల ముందస్తు అరెస్ట్
నర్సాపూర్ రూరల్: ట్రిపుల్ ఆర్ కోసం భూములు కోల్పోతున్న రైతులు గజ్వేల్‌లో సోమవారం ధర్నాకు పిలుపునిచ్చారు. నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ,చిన్నచింతకుంట గ్రామాల రైతులు ధర్నాకు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తమకు తెలియదన్నారు. పోలీసులు మాత్రం అరెస్ట్‌చేసి సుమారు మూడుగంటలపాటు స్టేషన్‌లో ఉంచారని పేర్కొన్నారు.
విద్యార్థినిని ఢీకొట్టిన బైక్
కొండపాక(గజ్వేల్): విద్యార్థినిని బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కుకునూరుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన మల్లం మేఘన(14) స్థానిక హైస్కూలులో 8వ తరగతి చదువుతోంది. రోజు మాదిరిగా సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే క్రమంలో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కావాలని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో ఇంటి వద్ద ఉందంటూ మరో ఇద్దరు విద్యార్థినులతో కలిసి వెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తున్న క్రమంలో రాజీవ్ రహదారి దాటుతోంది. ఈ క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యార్థినిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై ఎగిరి పడటంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆర్వీఎం ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.