నీట మునిగి 9 నెలల చిన్నారి మృతి
దుబ్బాకటౌన్: ద్విచక్ర వాహనం వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మున్సిపాలిటీలోని ధర్మాజీపేట వార్డు శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... 9వ వార్డుకు చెందిన లోకని వెంకటేశ్ చిన్నకోడూరు మండలంలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం అతని భార్య అపర్ణ అనారోగ్యానికి గురి కావడంతో పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చూపించేందుకు ద్విచక్ర వాహనంపై పెద్ద కూతురు హరి నందన, చిన్న కూతురు వినయ నందన (9 నెలలు)తో కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలో ధర్మాజీపేట శివారులోని మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి, రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ద్విచక్రవాహనంతో సహా చెరువులో పడ్డారు. వెంటనే వెంకటేశ్ తన భార్యను, పెద్ద కుమార్తెను చెరువు నుంచి బయటకు తీసుకురాగా, చిన్న కుమార్తె చెరువులోనే మునిగిపోయింది.
వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే సమాచారం గ్రామస్తులకు, పోలీసులకు అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయంతో చెరువులో గాలించగా ఎట్టకేలకు చిన్నారి మృతదేహం లభించింది. వెంటనే దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.