
కొనేదెలా.. తినేదెలా..?
పడిపోయిన దిగుబడి
● వర్షాలకు దెబ్బతిన్న పంటలు
● పెరిగిన కూరగాయల ధరలు
● లబోదిబోమంటున్న వినియోగదారులు
జహీరాబాద్ టౌన్: కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏదీ కొనలాన్న రూ.100 తక్కువ పలకడంలేదు. కిలో కొనే వారు పావు కిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. రూ. 500తో మార్కెట్‌కు వెళితే సంచి నిండడంలేదు. నిరుపేదలు కూరగాయలు కొనలేక పప్పుచారుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జహీరాబాద్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సుమారు ఐదువేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా.. కర్నాటక, మహారాష్ట్రాల నుంచి మార్కెట్‌కు ప్రతి రోజు కూరగాయలు వస్తుంటాయి. వర్షాల ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి తగ్గడం, భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో పంట దిగుబడి పడిపోవడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. జహీరాబాద్ ప్రాంతంలోని రైతులు టమాట, బెండకాయ, చిక్కుడు, గోరు చిక్కుడుతో పాటు ఆకు కూరలు సాగు చేస్తుండగా కర్నాటక, మహారాష్ట్రాల నుంచి క్యాబేజీ, కాలిఫ్లవర్, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, క్యారెట్, బీట్‌రూట్, బీరకాయ, టమాట పట్టణ మార్కెట్‌కు వస్తుంటాయి. పంట చేతికొస్తున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో దగుబడి తగ్గింది. దీంతో రైతులు నష్టపోగా.. వినియోగదారులకు అధిక భారమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్యారెట్, వంకాయ, చిక్కుడుకాయ, బిన్నీస్ తదితర కూరగాయలు రూ.120 వరకు పలుకుతున్నాయి. బీరకాయ, క్యాబ్సికం, క్యాబేజీ, బెండకాయ, కాలిప్లవర్ కిలో రూ.80 పలుకుతుంది. టమాట కిలో రూ.30, ఆలు కిలో రూ. 40,ఆకు కూరలు కట్టా 20 రూపాయలకు తక్కువకు లభించడం లేదు. సోరకాయ ఒక్కటి రూ.50 పలుకుతుంది. వెల్లుల్లి కిలో రూ.120 పలుకుతుండగా అల్లం ధర కాస్త తగ్గింది. అల్లం మార్కెట్‌లో కిలో రూ.40 వరకు పలుకుతోంది.
భారీ వర్షాల వల్ల కూరగాయల పంట దిగుబడి పడిపోయింది. ఎకరం పొలంలో బెండకాయ సాగు చేయగా వారానికి 30 కిలోల వరకు పంట వస్తుంది. కానీ ఎకరాకు సుమారు 100 కిలోల దిగుబడి రావాలి. అప్పుడే రైతుకు, ప్రజలకు లాభం ఉంటుంది. బెండకాయతో పాటు మిగతా కూరగాయల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
–యేసప్ప, రైతు, కృష్ణపూర్