సంగారెడ్డిలో పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో పాదయాత్ర

Oct 7 2025 4:56 AM | Updated on Oct 7 2025 4:56 AM

సంగారెడ్డిలో పాదయాత్ర

సంగారెడ్డిలో పాదయాత్ర

యూరియాపై నోరు మెదపరేం..?

వట్‌పల్లి(అందోల్‌): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డి మల్లన్నసాగర్‌ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు ఎలా తెస్తాడని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ ఏమైనా నీ అయ్య కట్టిండా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వట్‌పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ – బలయ్‌ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో 1.20 లక్షల ఎకరాల సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు సీఎం హోదాలో కేసీఆర్‌ శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ పనులను నిలిపివేసిందని విమర్శించారు. ఈ పథకాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంగారెడ్డి జిల్లాలో పాదయాత్రను చేపట్టనున్నట్లు హరీశ్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటేనే ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే ఢిల్లీ మెడలు వంచవచ్చునని, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీకి ఏ ప్యాకేజీ అడిగినా క్షణాల్లో నరేంద్రమోదీ మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 16 మంది కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఉన్నా.. తెలంగాణాకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, కలసికట్టుగా పనిచేస్తే సంగారెడ్డి జెడ్పీ పీఠం బీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.

యూరియా కొరతపై కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు ఎవరైనా పార్లమెంట్‌లో మాట్లాడారా అని హరీశ్‌ నిలదీశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గోధుమలు రూ.2,585, వడ్లకు రూ.2,369ల మద్దతు ధరను చెల్లించడంలో బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. కమీషన్‌లు వచ్చే పనులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఢిల్లీకి మూటలు మోసేందుకే రేవంత్‌రెడ్డికి సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్‌, మాణిక్‌రావు, మాజీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎస్పీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మాజీ జెడ్పీ చైర్మన్‌లు మంజుశ్రీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై సర్కార్‌ నిర్లక్ష్యం

మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

కలిసికట్టుగా పనిచేస్తే జెడ్పీ పీఠం మనదే

వట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘అలయ్‌–బలయ్‌’ కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement