
ఖేడ్‌లో కుమ్మేసిన వాన
● కాలనీలు జలమయం.. స్తంభించిన రాకపోకలు
● కంగ్టిలో అత్యధికంగా 12.56 సెం.మీ వర్షపాతం నమోదు
నారాయణఖేడ్: ఖేడ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కుండపోతగా కురియడంతో రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఉదయం 9గంటల వరకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో జనాలు ఇళ్లల్లోంచి రాలేకపోయారు. పట్టణ శివారులోని మన్సూర్‌పూర్ వాగు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరద నీటితో ఉధృతంగా ప్రవహించింది. ఫలితంగా ఖేడ్ నుంచి కంగ్టి, సిర్గాపూర్, పిట్లంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాంజీపూర్ వంతెనపై నుంచి, హన్మంత్‌రావుపేట్– మాద్వార్ వంతెనలపై నుంచి భారీ వరదనీరు ప్రవహించడంతో ఈ దారిలోనూ రాకపోకలు నిలిచిపోయాయి. వరదలు, చెరువుల్లోంచి నీరు పొంగిపొర్లడంతో వెంకటాపూర్, సంజీవన్‌రావుపేట్, గంగాపూర్ తదితర గ్రామాల్లోని పంటపొలాల్లోకి వరదనీరు చేరడంతో వరి పట మొత్తం నీటిపాలైంది.
కాలనీలు జలమయం
ఖేడ్ పట్టణంలోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. ఏఎస్‌నగర్, సిరూర్‌కాలనీ, దత్తాత్రేయ కాలనీతోపాటు పలు కాలనీల్లో వరదనీరు రెండుఫీట్ల ఎత్తువరకు ప్రవహించింది. రైతుబజార్‌తోపాటు జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లోకి వరదనీరు చేరుకుంది. కాలనీల్లోని రహదారులు జలమయం కావడంతో మున్సిపల్ అధికారులు హుటాహుటిన నీటి మళ్లింపు పనులు చేపట్టారు. ఖేడ్ మండలంలో 75.4 మి.మీ, కంగ్టిలో 125.6, నిజాంపేటలో 110.4, సిర్గాపూర్‌లో 104, నాగలిద్దలో 92.8, కల్హేర్‌లో 73.8, మనూరులో 52.4 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.