
ఆలయంలో చోరీ
మద్దూరు(హుస్నాబాద్): ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా... మండలంలోని లద్నూరు గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30వేల నగదు దోచుకెళ్లారు. పరిసరాల్లో మద్యం తాగి ఆలయంలోకి ప్రవేశించినట్లు అక్కడ లభ్యమైన ఖాళీ సీసాల ద్వారా తెలుస్తుంది. ఆలయ అర్చకుడు దూసకంటి వేణుశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు, క్లూస్‌టీం సభ్యులు ఆలయాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు.
తాళం వేసిన ఇంట్లో..
చేర్యాల(సిద్దిపేట): ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండల పరిధిలోని ముస్త్యాల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు తరిగొప్పుల నర్సింహులు వివరాల ప్రకారం... ఈ నెల 4న కుటుంబసభ్యులతో సహా హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్, అరతులం ఉంగరం, 25 తులాల వెండి గొలుసులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు.
నర్సాపూర్‌లో బైక్..
నర్సాపూర్ రూరల్: పార్కు చేసిన బైకును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని లింగాపూర్ పంచాయతీ పరిధిలోని జగ్య తండాకు చెందిన శ్రీనివాస్ ఈనెల 5న సాయంత్రం 6 గంటల సమయంలో తన బైకును వైన్స్ ఎదుట పార్క్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికి బైకు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
అల్లాదుర్గం(మెదక్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి పిట్లం వైపు బొలెరో వాహనంలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో అల్లాదుర్గం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి, కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.