
గడ్డి మందు తాగివృద్ధుడు ఆత్మహత్య
చేర్యాల(సిద్దిపేట): వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని నాగపురి గ్రామంలో చోటు చేసుకుంది. కొమురవెల్లి ఎస్‌ఐ లింగంపల్లి రాజుగౌడ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దేవనబోయిన రామచంద్రయ్య(70) మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ చేయడంతో కొడుకు మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చేర్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్వీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.
అప్పుల బాధతో
యువకుడు..
కల్హేర్(నారాయణఖేడ్): అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిర్గాపూర్ మండలం నల్లవాగు శివారులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ మహేశ్ వివరాల ప్రకారం... పోచాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్(34) అప్పులు, కుటుంబ కలహాలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.