
కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయి
● మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపణ
● మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు
న్యాల్‌కల్(జహీరాబాద్)/జిన్నారం(పటాన్‌చెరు): తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీలు రెండు మోసం చేశాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. న్యాల్‌కల్ మండల పరిధిలోని బీజేపీ నాయకులు పాండురంగారావు పాటిల్, బస్వరాజ్ పాటిల్, మల్లప్ప, తదితరులతోపాటు కార్యకర్తలు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో మాజీమంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి హరీశ్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్రని రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులేనన్నారు. ఎనిమిది మంది ఎంపీలు గెలుచుకున్న బీజేపీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ప్రాధాన్యతనిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలను చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు రాగానే ధరలు తగ్గించినట్లు డ్రామాలు చేయడం, ఎన్నికలు ముగియగానే మళ్లి పెంచుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జెడ్పీస్థానాన్ని బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంటుందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు రాజేందర్‌రెడ్డి, అప్పారావు పాటిల్, హనీఫ్ పాల్గొన్నారు.
హరీశ్‌రావుకు ఘన స్వాగతం
మెదక్ పట్టణ పర్యటనకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలో కలిసి వెళ్తున్న ఆయనకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల టోల్‌ప్లాజా వద్ద ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో చిమ్ముల నరేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, వెంకట్‌రామ్‌రెడ్డి, మంగయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.