
సంగారెడ్డి జెడ్పీ బీజేపీదే
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
● అందోలులో అలయ్–బలయ్ కార్యక్రమం
● స్థానిక ఎన్నికల్లో గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తాం
జోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి చాలా పెద్ద ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అందోలులో మొదటిసారి జరిగిన అలయ్ బలయ్‌కు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాల తో పంటలు దెబ్బతింటే కనీసం పరిశీలించేందుకు కూడా కాంగ్రెస్ సర్కారుకు ఖాళీలేకుండా పోయిందని విమర్శించారు.
కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
కార్యకర్తల ఉత్సాహం చూస్తోంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌్ పదవిని బీజేపీ పార్టీ కై వసం చేసుకోవడం ఖాయమని రామచంద్రారావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు.
బీజేపీలో చేరికలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది చంటి ప్రభు కుమార్తె చంటి దేవిక తమ మద్దతుదారులతో రామచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. పార్టీ తనకు ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని దేవిక చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్‌చార్జిలు దేశ్‌పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్‌గౌడ్, వివిధ మండల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.