
పత్తి తీతకు కూలీల కొరత
వలస కూలీలకు
ముందే అడ్వాన్సు
● వర్షాలతో పనికిరాకుండా పోతున్న పత్తి
● అప్పుల ఊబిలో రైతులు
● భారీగా తగ్గనున్న దిగుబడి
మునిపల్లి(అందోల్): పత్తి తీతకు కూలీల కొరత వేధిస్తోంది. దీంతో వలస కూలీలతో రైతులు పత్తి తీత పనులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. తరచూ వర్షం పడుతుండటంతో చేతికి వచ్చిన కిందకురాలి పనికి రాకుండా పోతోంది. ఈసారి దిగుబడి కూడా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాల్సి వస్తుందోనని వారు భయం వారిని వెన్నాడుతోంది. ఎకరాకు 6 క్వింటాళ్ల నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తుందనుకున్న పత్తి ఈసారి 2 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇలానే వర్షం పడితే ఉన్న పత్తి కుడా ఇంటికి తెచ్చే పరిస్థితి లేకుండా పోతుందేమోనని రైతులు దిగులు చెందుతున్నారు.
పత్తి పంట విత్తనాలు నాటిన నుంచి కలుపుతీత, మందు పిచికారీ, పత్తి పంట తెంపే వరకు ఉండడానికి తగిన సౌకర్యాలను రైతులు కల్పించారు. కూలీలకు గుడారాలు, నిత్యవసర సరుకుల వంటి వాటికి ముందే వలస కూలీలకు కొంత అడ్వాన్సు ఇచ్చి స్థానికంగా ఉండేందుకు రైతులు ఏర్పాటు చేశారు.