
ఏడుపాయల జనసంద్రం
● 50 రోజులుగా జలదిగ్బంధంలో దుర్గమ్మ
● రాజగోపురంలోనే పూజలు
● మంజీరా వరదలతో భారీ నష్టం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం వర్షం రావడంతో పాటు సత్రాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. చెట్ల కింద టెంట్లు వేసుకొని సేద దీరారు. కాగా సుమారు 50 రోజులుగా ఏడుపాయల మంజీరా వరదల్లో చిక్కుకుంది. ఆదివారం వరదలు తగ్గడంతో సిబ్బంది ఆలయంలోకి వెళ్లారు. 2016 తర్వాత భారీ స్థాయిలో వచ్చిన వరదలతో ప్రసాదం షెడ్డు కొట్టుకుపోయింది. ఆలయం ఎదుట ఉన్న క్యూలైన్లు వరద పాలయ్యాయి. గర్భగుడిలోని గ్రిల్స్, రేకులు, జాలి ధ్వంసం కాగా, మండపంలోని గ్రానైట్ బండలు, టైల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. ఆలయ ప్రాంగణం మొత్తం పాకురుతో నిండిపోయింది. అయితే ఆలయ సిబ్బంది ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే కొంతమేర నష్టం తగ్గేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పూర్తిస్థాయి ఈఓను నియమించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయం శుద్ధి చేసిన తర్వాత గర్భగుడి దర్శనాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అప్పటివరకు రాజగోపురంలోనే అమ్మవారి దర్శనాలు కొనసాగనున్నాయి.

ఏడుపాయల జనసంద్రం