
శాశ్వతంగా..
ఎంప్లాయ్‌మెంట్ కార్డు
ప్రయోజనం పొందనున్న నిరుద్యోగులు
● ఎంప్లాయ్‌మెంట్‌లో నమోదు చేసుకోవాలి
● అవగాహన కల్పిస్తున్న జిల్లా ఉపాధి అధికారులు
నిరుద్యోగ యువత ఉపాధి కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్‌మెంట్ కార్డులు ఉంటే వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. జిల్లాలోని వివిధ కంపెనీలతో అధికారులు మాట్లాడి ప్రతి నెలా మూడు నుంచి ఐదు జాబ్ మేళాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసులో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు శాశ్వతంగా ఉపాధి కార్డు చెల్లుబాటవుతుంది. ఇందుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
– సంగారెడ్డి టౌన్:
జిల్లాలో గతంలో ఎంతోమంది యువత కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు. ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్‌మెంట్ కార్డు (ఉపాధికార్డు) తప్పనిసరిగా ఉండాలి. జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు గతంలో మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చేది. గడువు తీరాక రెన్యూవల్ చేసుకునేందుకు ఇబ్బందులు తలెత్తేవి. రెన్యూవల్ చేయని కార్డులు రద్దయ్యేవి. దీంతో ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్‌లో అభ్యర్థుల సంఖ్య తగ్గిపోతుండేది. ఇప్పుడు ఆ కష్టాలు తొలగిపోయాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు కార్డు చెల్లుబాటవుతుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. అవగాహన లేక చాలామంది ఉపాధికార్డుకు దరఖాస్తు చేసుకోవడం లేదు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఆపై ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 15.28 లక్షల జనాభా ఉండగా అందులో సుమారుగా 7 లక్షల 20 వేల మంది యువత ఉంటే.. 11,850 మంది మాత్రమే కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఒక్క రోజులోనే కార్డు..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్క రోజులోనే శాశ్వత ఉపాధి కార్డులు జారీ చేస్తున్నారు. గతంలో కార్డులను తీసుకోకపోతే సీనియారిటీని కోల్పోవాల్సి వచ్చేది. ఏ ఇబ్బంది లేకుండా కొన్ని నెలలుగా జిల్లా ఉపాధిశాఖ కొత్తగా శాశ్వత కార్డుల విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతి మూడేళ్లకోసారి కార్డులను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో రద్దయిన వారు ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకుంటే శాశ్వతకార్డులు అందజేస్తారు. దీనిపై నిరుద్యోగులకు ఉపాధిశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగ మేళాలకు హాజరయ్యే వారికి ఉపాధికార్డులు లేకపోతే దరఖాస్తులను స్వీకరించి కార్డులు జారీ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఒక్క రోజులోనే కార్డులు జారీ చేస్తున్నారు. అత్యవసరమైన వారికి వెంటనే ఇస్తున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
ఉపాధి కార్డులు కావాల్సిన వారు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దగ్గరలోని మీసేవ లేదా ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి ఉపాధి కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు ఫోన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం www.employment. telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. దీంతోపాటు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయా ల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విస్తృతంగా అవగాహన
ప్రస్తుతం ఉద్యోగాలకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఉపాధి కల్పన కార్యాలయంలో శాశ్వత ఉపాధికార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం. జాబ్ మేళాలు, ఎంప్లాయ్‌మెంట్ కార్డులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – అనిల్ కుమార్,
జిల్లా ఉపాధి కల్పన అధికారి

శాశ్వతంగా..