విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం

Oct 6 2025 6:23 AM | Updated on Oct 6 2025 6:23 AM

విద్య

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం

చేర్యాల(సిద్దిపేట): ఇటీవల నూతనంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురిని ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. స్థానిక సంఘం భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్‌ మాట్లాడుతూ కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, పుట్టిన ఊరుకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో కోశాధికారి సమ్మయ్య, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి దుర్గయ్య, సహాయ కార్యదర్శి నర్సింహులు, లక్ష్మణ్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

వ్యాన్‌ డ్రైవర్‌ రిమాండ్‌

బెజ్జంకి(సిద్దిపేట): రాజీవ్‌ రహదారిపై శనివారం తల్లీకూతురు మరణానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ అయూబ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం సిద్దిపేట రూరల్‌ ఇన్‌చార్జి సీఐ పి.శ్రీనివాస్‌ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. అజాగ్రత్తగా, మద్యం మత్తులో వ్యాన్‌ నడిపి ఇద్దరి మరణానికి కారణమైన డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సౌజన్య, ఏఎస్‌ఐ శంకర్‌రావు పాల్గొన్నారు.

డెంగీతో విద్యార్థి మృతి

చిన్నశంకరంపేట(మెదక్‌): డెంగీ జ్వరంతో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండలంలోని ఎస్‌.కొండాపూర్‌ గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాధానోపాధ్యాయుడు కుమ్మరి శ్యామ్‌ కుమారుడు ప్రభాస్‌(20) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. పది రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. మెదక్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ఆదివారం ఉదయం మృతి చెందాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రభాస్‌ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పేకాట స్థావరంపై దాడి

20 మందిపై కేసు నమోదు

పటాన్‌చెరు టౌన్‌: పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేశ్‌ వివరాల ప్రకారం... అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ మండే మార్కెట్‌ సమీపంలో విందు హోటల్‌ నిర్వాహకుడు చంద్రకాంత్‌ రెడ్డి పేకాట ఆడిస్తున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో శనివారం రాత్రి ఎస్‌ఐ రామాంజనేయులు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడుల్లో 20 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. లక్షా 20 వేల నగదు, ఏడు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 21 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

పటాన్‌చెరు టౌన్‌: ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన ఆంజనేయులు, భార్య నాగమణి శనివారం రాత్రి కొండకల్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి వేసిన తాళం పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రెండు తులాల పుస్తెలతాడు, 20 తులాల వెండి, రెండు జతల కమ్మలు, రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

నర్సాపూర్‌రూరల్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం... పట్టణంలోని సునీతారెడ్డి కాలనీకి చెందిన పాత్‌లోత్‌ భిక్షపతి దసరా పండుగకు ఈనెల2న అన్నారంలోని తన కూతురు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఈనెల 4న రాత్రి ఇళ్లు మంటల్లో కాలిపోతుందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చారు. అప్పటికే ఫైర్‌ ఇంజిన్‌, పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. కాగా ఇంట్లోని ఇంటి పత్రాలు, భూ పట్టా బుక్‌, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఇతర సామగ్రి పూర్తి కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం1
1/2

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం2
2/2

విద్యార్థులు, ఉద్యోగులకు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement