
పండుగకు వచ్చి పరలోకానికి..
బెజ్జంకి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో తల్లీ,కూతురు మృతి చెందారు. ఈ ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. బెజ్జంకి ఎస్‌ఐ సౌజన్య, బంధువుల కథనం ప్రకారం... కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన వీణారాణి, సుమన్ వారి కుమార్తెలు యశస్విని, మనస్వినిలతో కలిసి కోహెడ మండలంలోని వింజపల్లికి దసరా పండుగకు వీణా తమ్ముడి ఇంటికి వచ్చారు. తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళుతున్న క్రమంలో దేవక్కపల్లె సమీపంలోని రాజీవ్ రహదారి పక్కన అమ్ముతున్న సీతా ఫలాలు కొనేందుకు దిగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపునకు హార్వెస్టర్ కట్టర్‌బార్‌ను రిపేరుకు తీసుకెళుతున్న ట్రాక్టర్‌ను అదే వైపునకు వెళుతున్న డీసీఎం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రోడ్డు పక్కకు పడిపోగా హార్వెస్టర్ కట్టర్‌బార్ సుమన్, వీణారాణి, యశస్విని, మనస్వినిలకు తగిలింది. దీంతో వీణారాణి (39), యశస్విని (6) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన మనస్విని, సుమన్, ట్రాక్టర్ డ్రైవర్ రాజులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మనస్వినిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సుమన్ స్వగ్రామంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మద్యం మత్తులో అతివేగంగా డీసీఎం నడుపుతూ ఢీకొట్టిన ఆయుబ్‌ఖాన్‌పై మృతురాలి సోదరుడు జగదీశ్వరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఏసీపీ సుమన్, సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం
ట్రాక్టర్‌లోని హార్వెస్టర్ కట్టర్‌బార్‌ఢీకొని తల్లీకూతురు మృతి
ముగ్గురికి గాయాలు

పండుగకు వచ్చి పరలోకానికి..