
మూడు రోజుల్లో ముగ్గురు మృతి
– ధర్మారంలో విషాదం
మిరుదొడ్డి(దుబ్బాక): మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బుధవారం సద్దుల బతుకమ్మ పండుగ రోజున గ్రామానికి చెందిన వరద రాజయ్య (60) పాలు తీసుకురావడానికి దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తున్న క్రమంలోనే ఆయన మృతి చెందాడు. గురువారం దసరా రోజున ఆయన అంత్యక్రియలు ముగిసిన తర్వాత అదే గ్రామానికి చెందిన సద్ది పున్నారెడ్డి (58) అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన కూరాకుల దేవయ్య (38) అనుమానాస్పద స్థితిలో సిద్దిపేట మండలంలోని ఇర్కోడు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. ఇక దేవయ్య మృతదేహం శనివారం గ్రామానికి రావడంతో అంత్యక్రియలు నిర్వహించారు. వరుసగా మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామ పజ్రలు ఆందోళన చెందుతున్నారు.