
మంజూరైనా.. మోక్షం ఎన్నడో!
జహీరాబాద్: పారిశ్రామిక కేంద్రంగా ఉన్న జహీరాబాద్ నుంచి సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు మధ్య 70 కిలోమీటర్ల నిడివితో కొత్త రైల్వేలైన్ నిర్మాణం మంజూరై రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు సర్వే పనులు మొదలు కాలేదు. ఈపాటికే సర్వే పనులు చేపట్టి ఇందుకవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా రైల్వే శాఖ అవలంభిస్తున్న ఉదాసీన వైఖరితోనే సర్వే పనులు ఇంకా మొదలుకాలేదని తెలుస్తోంది. సికింద్రాబాద్–వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వేలైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ప్రస్తుతం జహీరాబాద్ నుంచి తాండూర్‌కు వెళ్లాలంటే సుమారు రెండున్నర గంటలకు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ రద్దీ, రైల్వే క్రాసింగ్ వంటివి కూడా ఉంటే ఒక్కోసారి మూడు గంటలు కూడా పట్టేస్తోంది. అదే కొత్త రైల్వే మార్గం పూర్తయితే కేవలం గంటలోపులోనే గమ్యం చేరుకోవచ్చు.
ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం
జహీరాబాద్–తాండూర్ పట్టణాల మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అదే రైలులో వెళ్లాలంటే 104 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. జహీరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం బీదర్–బెంగళూరు రైళ్లు వికారాబాద్ వరకు వెళ్లి తిరిగి తాండూరు మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో అదనపు ప్రయాణం తప్పడం లేదు. తాండూరు చుట్టుపక్కల ప్రాంతాలకు జహీరాబాద్, సంగారెడ్డి, కర్ణాటకలోని బీదర్ చుట్టుపక్క ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ఎక్కువమంది రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇక ముంబైకు వెళ్లే వారు జాతీయ రహదారి మీదుగానున్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను పట్టుకుని వెళ్తున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణికుల రద్దీ అధికంగానే ఉంటుంది.
అటు సరుకు రవాణాకు అనుకూలం
ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. అటు సరుకు రవాణాకు, ఇటు ప్రయాణికులకు కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. బీదర్ మార్గంలో సరుకులు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా జహీరాబాద్ నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో జహీరాబాద్ నుంచి తాండూర్‌కు నేరుగా కొత్త రైల్వేలైన్‌ను రైల్వేశాఖ ప్రతిపాదించింది. అక్టోబర్ 2023న ఈ కొత్త రైల్వేలైన్‌కు మంజూరు లభించింది. అప్పట్నుంచి సర్వే పనులు చేపట్టలేదు.
ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలి
సర్వే పనులు ప్రారంభించేందుకే ఇంత జాప్యం జరుగుతుంటే ఇక రైల్వే మార్గం ఎప్పుడు పూర్తవుతుందోననే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజా ప్రతినిధులు సీరియస్‌గా తీసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచే వారు లేకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. సర్వే పనులను ప్రారంభింపజేసే విషయంలో ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
రెండేళ్ల క్రితమే మంజూరైన జహీరాబాద్–తాండూర్ కొత్త రైల్వేలైన్
ఇంకా మొదలుకాని సర్వే పనులు,
భూ సేకరణ ప్రక్రియ
70 కిలోమీటర్లు నిర్మించేందుకు
నిర్ణయం
రూ.1,400 కోట్ల అంచనా వ్యయం
ప్రస్తుతం బీదర్–బెంగళూరు రైల్లో
రెట్టింపు ప్రయాణం

మంజూరైనా.. మోక్షం ఎన్నడో!